ప్రపంచ భద్రతా సవాళ్లపై విద్యార్థుల చర్చ
పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు తేదీః 25 అక్టోబర్ 2025 ప్రపంచ భద్రతా సవాళ్లపై విద్యార్థుల చర్చ అపోలో యూనిర్శిటీలో ఐక్యరాజ్యసమితి దినోత్సవం చిత్తూరు, అక్టోబర్ 25: యువతలో అంతర్జాతీయ దౌత్య దృక్పథం, చర్చా నైపుణ్యం, ప్రపంచ శాంతి పట్ల అవగాహన పెంచే ప్రయత్నంగా ది అపోలో యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా మోడల్ యునైటెడ్ నేషన్స్ క్లబ్ ఆధ్వర్యంలో “అంతర్జాతీయ భద్రతా మండలి సమావేశం” శైలిలో మాక్ సిమ్యులేషన్ నిర్వహించి, సైబర్ దాడులు, యుద్ధ ముప్పులు, మానవతా సవాళ్లు వంటి అంశాలపై విద్యార్థులు లోతైన చర్చలు జరిపారు. ఈ కార్యక్రమం శనివారం క్యాంపస్‌లోని డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నాల్డెజ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగింది. యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాల ప్రతినిధులుగా విద్యార్థులు వ్యవహరిస్తూ, అంతర్జాతీయ భద్రత, సైబర్ యుద్ధం, దేశాల పరస్పర సహకారం వంటి అంశాలపై అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ప్రతి ప్రతినిధి తన దేశం తరఫున వాదనలు, ప్రతివాదాలు చేస్తూ దౌత్య చాతుర్యాన్ని చాటారు. కార్యక్రమానికి ది అపోలో యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎ. సేతురామ సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచ స్థాయి సమస్యలపై విద్యార్థులు లోతుగా ఆలోచించి, సమగ్ర పరిష్కారాలపై చర్చించడం భవిష్యత్తు నాయకత్వ లక్షణాలకు పునాది వేస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో విశ్లేషణా దృష్టిని పెంపొందిస్తాయని ఆయన అన్నారు. ఈ సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన అజెండాగా — “నాటో సభ్య దేశాలపై జరుగుతున్న సైబర్ దాడులు, మిశ్రమ యుద్ధ పద్ధతులు, సైనిక ముప్పుల నేపథ్యంలో వ్యూహాత్మక, మానవతా మరియు భద్రతా ప్రతిస్పందనలపై చర్చలు” అనే అంశాన్ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు నేటి ప్రపంచానికి సంబంధించిన అత్యంత ప్రాధాన్యత గల అంశాలపై ఆలోచనాత్మక చర్చలు జరిపారు. చర్చల ముగింపులో ఉత్తమ ప్రతినిధులుగా ఎంపికైన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఎస్‌ఆర్ డీన్ డాక్టర్ అల్ఫ్రెడ్ జె అగస్ట్రిన్, అపోలో మోడల్ యునైటెడ్ నేషన్స్ క్లబ్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్ డాక్టర్ సుధా .పి, డాక్టర్ షాని ఎస్.ఎస్, క్లబ్ సభ్యులు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ————————————— డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ అండ్ పబ్లికేషన్స్, ది అపోలో యూనిర్శిటీ, చిత్తూరు.