ఘనంగా అపోలో యూనివర్సిటీ స్నాతకోత్సవం
పత్రికా ప్రకటన
ది అపోలో యూనిర్శిటీ, చిత్తూరు
తేదీః 21 ఫిబ్రవరి 2026
ఘనంగా అపోలో యూనివర్సిటీ స్నాతకోత్సవం
సేవలు–సాంకేతికతలో అపోలోకు ప్రపంచ అగ్రస్థానంః డా. ప్రతాప్ సి రెడ్డి
చిత్తూరు, ఫిబ్రవరి 21: విద్యా వైభవం, అకాడెమిక్ గౌరవం, పట్టభద్రుల ఆనందోత్సాహాల నడుమ ది అపోలో యూనివర్సిటీ ద్వితీయ స్నాతకోత్సవం శనివారం సాయంత్రం చిత్తూరు మురకంబట్టులోని అపోలో నాలెడ్జ్ సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డా. ప్రతాప్ సి. రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఐఐటీ తిరుపతి డైరెక్టర్ డా. కె.ఎన్. సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఛాన్సలర్ డా. ప్రతాప్ సి. రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించుకోవాలని సూచించారు. 43 సంవత్సరాల క్రితం ప్రాథమిక ఆరోగ్య సేవలతో ప్రారంభమైన అపోలో సంస్థ ఈ రోజు సేవలు, సాంకేతికత, వైద్య ఫలితాల్లో ప్రపంచస్థాయిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ మూడు సంవత్సరాల్లోనే విశేష పురోగతి సాధించి, కొత్త కోర్సులు ప్రారంభించి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
సాంకేతికత, పరిశోధన, విలువలతో కూడిన విద్యే భవిష్యత్తుకు బాటవేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే లక్షలాది హృదయ శస్త్రచికిత్సలు నిర్వహించి అపోలో అగ్రస్థానంలో ఉందని, ప్రోటాన్ టెక్నాలజీ ద్వారా క్యాన్సర్ చికిత్సలో దేశానికి దిశానిర్దేశం చేస్తోందని వివరించారు.
ముఖ్య అతిథి డా. కె.ఎన్. సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞానం, నైతిక విలువలను సమన్వయం చేసుకుని భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు. అపోలో సంస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన డా. ప్రతాప్ సి. రెడ్డి సేవలను కొనియాడారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఐఐటీ తిరుపతి–అపోలో యూనివర్సిటీ మధ్య ఎంఓయూ కుదిరిందని, సంయుక్త పరిశోధనలకు సహకారం అందిస్తామని చెప్పారు.
విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ వార్షిక నివేదికను సమర్పిస్తూ అకాడెమిక్ పురోగతి, పరిశోధన విజయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను వివరించారు. అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ డా. ప్రీతా రెడ్డి విద్యా–ఆరోగ్య రంగాల్లో నైపుణ్యంతో కూడిన నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ డా. సునీత రెడ్డి యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వందలాది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. పట్టభద్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో అపోలో నాలెడ్జ్ సిటీ సీఈఓ శివరామకృష్ణన్ వెంకటేశ్వరన్, ప్రో–చాన్సలర్ డా. రవి రాజు టి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు, డీన్లు, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
అస్త్రా క్రీడా సముదాయం ప్రారంభం
అపోలో నాలెడ్జ్ సిటీ ప్రాంగణంలో ‘అస్త్రా – అపోలో స్పోర్ట్స్ అండ్ రిక్రియేషనల్ అరేనా’ను శనివారం మధ్యాహ్నం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ప్రీతా రెడ్డి హాజరయ్యారు. అస్త్రా ప్రధాన క్రీడా సముదాయంతో పాటు బాస్కెట్బాల్, ఫుట్బాల్, వాలీబాల్ మైదానాలను ప్రారంభించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలకు కీలక పాత్ర ఉందని, ఆరోగ్యకర జీవనశైలికి క్రీడలు అవసరమని డా. ప్రీతా రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.