Enquire Now
Enquire Apply

ఒక ప్రపంచం – ఒక ఆరోగ్యం’ నినాదంతో

పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్శిటీ, ఏఐఎంఎస్‌ఆర్‌, చిత్తూరు తేదీ: 05 నవంబర్ 2025 ఒక ప్రపంచం – ఒక ఆరోగ్యం’ నినాదంతో అపోలో విద్యార్థుల భారీ ర్యాలీ చిత్తూరు, నవంబర్‌ 5: “ఒక ప్రపంచం – ఒక ఆరోగ్యం అన్న సమగ్ర నినాదంతో అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్‌), ది అపోలో యూనివర్శిటీ సంయుక్తంగా బుధవారం అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించాయి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్రివెంటివ్ అండ్ సోషియల్ మెడిసిన్ (ఐఏపీఎస్‌ఎమ్‌), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్‌) సంస్థల సహకారంతో జరిగిన ఈ ర్యాలీ ద్వారా మానవుడు – జంతువు – పర్యావరణం అనే త్రిసంబంధ ఆరోగ్య భావనను ప్రజలకు చాటిచెప్పారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ ఏఐఎంఎస్‌ఆర్‌ పరిపాలనా భవనం వద్ద ప్రారంభమై మురకంబట్టు సర్కిల్‌ వరకు సాగింది. విద్యార్థులు ఆరోగ్య చైతన్య నినాదాలు చేస్తూ, ప్లేకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకొని ప్రజల్లో “స్వచ్ఛతే ఆరోగ్యానికి పునాది”, “ప్రకృతి సంరక్షణే ప్రాణాధారం” వంటి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మురకంబట్టు సర్కిల్‌లో విద్యార్థులు “మానవ హారం”గా నిలబడి మానవుడు–జంతువు–పర్యావరణం పరస్పర అనుసంధానం ద్వారానే స్థిరమైన ఆరోగ్య సమాజం సాధ్యమని స్పష్టం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వీధి నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణ, ప్రజా ఆరోగ్యం, పరిశుభ్రత, జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలపై సందేశాత్మకంగా రూపొందించిన ఈ నాటిక ప్రజల్లో చైతన్యం కలిగించింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ — “మానవ ఆరోగ్యాన్ని కాపాడాలంటే ప్రకృతితో సమతుల్యత తప్పనిసరి. పర్యావరణం, జంతువులు, మనుషుల ఆరోగ్యం ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయి. ఈ భావనతో ముందుకు సాగితేనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డా. కె. అశోక్ కుమార్ రెడ్డి, నోడల్‌ ఆఫీసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. దేవికా పి.జె, అపోలో ఫిజియోథెరపీ కాలేజీ ప్రిన్సిపల్‌ డా. కిరణ్‌, అలాగే వైద్య విద్యార్థులు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, సీనియర్‌ రెసిడెంట్లు, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌, పబ్లిక్‌ హెల్త్‌ (MPH), అపోలో సోషల్‌ రెస్పాన్సిబిలిటీ క్లబ్‌, ఎకో క్లబ్‌ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్, ది అపోలో యూనివర్శిటీ, చిత్తూరు.