Enquire Now
Enquire Apply

తాళంబేడులో అపోలో యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం

పత్రికా ప్రకటన ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు తేదీ: 29 డిసెంబర్‌ 2025 తాళంబేడులో అపోలో యూనివర్శిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం గ్రామస్థులతో మమేకమై సేవ చేయాలి: ప్రొ. ఎం. పోతరాజు చిత్తూరు, డిసెంబర్‌ 29: చిత్తూరు మండలం తాళంబేడు గ్రామంలో ది అపోలో యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌–1 ఆధ్వర్యంలో వారం రోజుల ప్రత్యేక సేవా శిబిరం సోమవారం ప్రారంభమైంది. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొ. ఎం. పోతరాజు ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనమే కాదు మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని అన్నారు. ఈ భావనను గ్రామస్థులు, విద్యార్థుల్లోకి తీసుకెళ్లడమే ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం, విద్యార్థులు చక్కగా ముస్తాబై ఉండటం, యూనిఫారం సక్రమంగా ఉండటాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థులు ఏ స్థాయికి ఎదిగినా తమ పుట్టిన ఊరు, చదువుకున్న పాఠశాల కోసం సేవ చేయాలనే భావన పెంపొందించుకోవాలని సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను, సేవాభావాన్ని మరింత బలపరుస్తాయని తెలిపారు. ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవే నిజమైన సేవ అని ఆయన స్పష్టం చేశారు. తాళంబేడు జెడ్పీ హైస్కూల్‌ హెడ్‌మాస్టర్‌ ప్రకాష్‌బాబు మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు విద్యార్థుల్లో సేవాభావం, మానవీయ విలువలు, బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ముస్తాబు అంటే కేవలం శరీర శుభ్రతకే పరిమితం కాకుండా పరిసరాలు, మానసిక శుభ్రత కూడా అవసరమని విద్యార్థులకు తెలియజేస్తూ అపోలో యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంసించారు. శిబిరం తొలి రోజున ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు తాళంబేడు జెడ్పీ హైస్కూల్‌ పరిసరాలను శుభ్రపరిచి, స్వచ్ఛ భారత్‌ లక్ష్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశుభ్రత, సామాజిక బాధ్యత ప్రాముఖ్యతను తెలియజేసేలా ఒక అవగాహనా స్కిట్‌ను కూడా ప్రదర్శించారు. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ శిబిరంలో బాల కార్మికత్వ నిర్మూలనపై అవగాహన, ఒత్తిడి నివారణకు యోగా, డ్రైవింగ్‌ భద్రత, మాసిక ఆరోగ్య పరిశుభ్రత, సైబర్‌ సెక్యూరిటీ, పొగత్రాగడం మానేయాలనే అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రకాష్‌, విఆర్‌వో ఆనందనాయుడు, ఫస్ట్‌ అసిస్టెంట్‌ రెడ్డయ్యనాయుడు, అపోలో యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ హేమాద్రి రెడ్డి, యూనిట్‌–1 ఆఫీసర్‌ గాయత్రి, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ———————- ప్రెస్ & పబ్లికేషన్స్ విభాగం, ది అపోలో యూనివర్సిటీ, చిత్తూరు