ఆరోగ్యరంగానికి పాథాలజీ వెన్నెముక
పత్రికా ప్రకటన ఏఐఎంఎస్‌ఆర్, చిత్తూరు
తేదీ: 14 నవంబర్ 2025
ఆరోగ్యరంగానికి పాథాలజీ వెన్నెముక
అపోలోలో ఘనంగా అంతర్జాతీయ పాథాలజీ డే వేడుకలు
చిత్తూరు, నవంబర్ 14: అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్) పాథాలజీ విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ పాథాలజీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం ఏఐఎంఎస్‌ఆర్ క్యాంపస్‌లో జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ఏఐఎంఎస్‌ఆర్ అసోసియేట్ డీన్ డాక్టర్ రమ్యా రామకృష్ణన్ పాథాలజీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్యరంగ అభివృద్ధిలో పాథాలజిస్టుల పాత్ర అపూర్వమని పేర్కొన్నారు. రోగి శరీరంలో జరిగే సూక్ష్మ మార్పులను గుర్తించి ఖచ్చితమైన నిర్ధారణ అందించడంలో పాథాలజీ విభాగం కీలకమని ఆమె అన్నారు. “శస్త్రచికిత్సల సమయంలో ఫ్రోజెన్ సెక్షన్ వంటి అత్యవసర పద్ధతుల ద్వారా వెంటనే ఫలితాలు ఇచ్చి వైద్యులకు, రోగుల ప్రాణరక్షణకు పాథాలజిస్టులు అందించే సేవలు అత్యంత విలువైనవి” అని డాక్టర్ రమ్యా రామకృష్ణన్ తెలిపారు.
పాథాలజీ దినోత్సవ ప్రాధాన్యతను వివరించిన ప్రొఫెసర్ డాక్టర్ సీ. ఆర్. సిరాజున్నీసా బేగమ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ రెండో బుధవారం అంతర్జాతీయ పాథాలజీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు గుర్తుచేశారు. రోగ నిర్ధారణ, వ్యాధి వ్యాప్తి నియంత్రణ, ముందస్తు హెచ్చరికల ఆధారంగా చికిత్సను వేగవంతం చేయడంలో పాథాలజీ అత్యంత కీలకమైన శాస్త్రంగా నిలుస్తోంది అని ఆమె పేర్కొన్నారు.
వారోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో విజ్ఞానాన్ని, సృజనాత్మకతను పెంపొందించేందుకు క్విజ్, పోస్టర్ తయారీ పోటీలను నిర్వహించారు. విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో పాథాలజీ విభాగ అధిపతి డాక్టర్ పి. విజయ్‌కుమార్, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, ఫార్మకాలజీ హెడ్ డాక్టర్ సచిదానంద అదిగ, ఫ్యాకల్టీ సభ్యులు, వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు.
————————-
డైరెక్టరేట్ ఆఫ్ ప్రెస్ & పబ్లికేషన్స్, ది అపోలో యూనివర్శిటీ – AIMSR, చిత్తూరు.